శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయనని సరిపోలగల వ్యక్తి మరొకరు లేరంటే అది అతిశయోక్తి కానేరదు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేరీయన.

వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి సుబ్రహ్మణ్యశాస్త్రి.

ఈయన తల్లిదండ్రులు: మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. జీవితకాలం: 1891 - 1961. స్వస్థలం: తూర్పుగోదావరి జిల్లా, మహేంద్రవాడ.

మూలం: అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991